ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై గంటల లెక్కన డాక్టర్ల నియామకం

-

ఫ్యామిలీ ఫిజిషియ‌న్ వైద్య విధానానికి సంబంధించిన‌ ట్ర‌య‌ల్ ర‌న్‌ విజ‌య‌వంతంగా సాగుతోంద‌ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు తెలిపారు.వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌ధాన కార్యాల‌యం, కాన్ఫ‌రెన్స్ హాలులో వైద్య ఆరోగ్య‌శాఖ ఉన్న‌తాధికారుల‌తో ఫ్యామిలీ ఫిజిషియ‌న్ ట్ర‌య‌ల్ ర‌న్ పై స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి గారి ఆలోచ‌న‌ల్లోంచి వ‌చ్చిన గొప్ప కార్య‌క్ర‌మాల్లో ఫ్యామిలీ ఫిజీషియ‌న్ వైద్య విధానం కూడా ఒక‌ట‌ని తెలిపారు.

 

గ‌త నెల 21వ తేదీ నుంచి ఈ కార్య‌క్ర‌మం ట్ర‌య‌ల్ ర‌న్ ప్రారంభ‌మైంద‌న్నారు. ఈ వైద్య విధానం సాగుతున్న తీరు, క్షేత్ర‌స్థాయిలో ఎద‌రవుతున్న ఇబ్బందులు, ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స్పంద‌న, వైద్యుల నుంచి వ‌స్తున్న సూచ‌న‌లు తదిత‌ర వివ‌రాలను అధికారుల ద్వారా మంత్రి అడిగి తెలుసుకున్నారు. కేవ‌లం మూడు వారాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 4733 వైఎస్సార్ హెల్త్‌క్లినిక్‌ల‌కు రెండుసార్లు 104 ఎంఎంయూ వాహ‌నాలు వెళ్లాయ‌ని, సిబ్బంది రెండు విడ‌త‌లుగా ఆయా గ్రామాల‌కే వెళ్లి వైద్య ప‌రీక్ష‌లు అందించార‌ని తెలిపారు. మ‌రో 4267 విలేజ్ హెల్త్ క్లినిక్‌ల‌కు 104 ఎంఎంయూ వాహ‌నాలు ఒక‌సారి వెళ్లాయ‌ని వివ‌రించారు.

 

ఆయా వాహ‌నాల ద్వారా వైద్య సిబ్బంది ప్ర‌జ‌ల‌కు సంతృప్తి క‌ర‌మైన వైద్య సేవ‌లు అందించాయ‌ని చెప్పారు.నియామ‌కాలు నిరంత‌రం జ‌రిగేలా చూడాల‌ని మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు ఆదేశాలు జారీచేశారు. ఇప్ప‌టికే ఈ మేర‌కు ప్ర‌త్యేక జీవో కూడా జారీ చేశామ‌ని తెలిపారు. అన‌స్తీషియా వైద్యులు ఎక్క‌డ లేరో చూసి, వెంట‌నే నియామ‌కాలు చేప‌ట్టాల‌న్నారు. ప్ర‌తి ఆస్ప‌త్రిలో ఆన‌స్తీషియా వైద్యులు ఉండేలా స‌ర్దుబాటుచేయాల‌ని ఆదేశించారు. వ్యవ‌ధి ఆధారిత సేవ‌ల‌కు గాను వైద్యులను నియ‌మించుకునే విష‌య‌మై జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు విధివిధానాలను పంపాల‌ని చెప్పారు. ఆ వైద్యులకు వెనువెంట‌నే పారితోషికం అందేలా చూడాల‌ని ఆదేశించారు. డిప్యూటీ సివిల్ స‌ర్జ‌న్ల‌ను సివిల్ స‌ర్జ‌న్లుగా, సీఏఎస్‌ల‌ను డీసీఏఎస్‌లుగా వెంట‌నే ప్ర‌మోష‌న్లు చేప‌ట్టాల‌ని చెప్పారు. 2020 విధుల్లో చేరిన సీఏఎస్ స్పెష‌లిస్టు డాక్ట‌ర్ల‌కు పేస్కేల్ అమ‌ల‌య్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. పీహెచ్‌సీల్లో ఖాళీగా ఉన్న 572 స్టాఫ్ న‌ర్సు పోస్టుల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాల‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news