మనకు హార్ట్ ఎటాక్‌లు, ఇతర గుండె జబ్బులు వచ్చేందుకు గల ముఖ్య కారణాల్లో శరీరంలో అధికంగా కొలెస్ట్రాల్ పేరుకుపోవడం కూడా ఒకటి. దీని వల్ల రక్తనాళాల్లో రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా హైబీపీ వస్తుంది. దీంతో హార్ట్ ఎటాక్, గుండె జబ్బులు వస్తాయి. అయితే నిత్యం మనం తినే పలు రకాల ఆహారాపదార్థాల్లో మార్పులు, చేర్పులు చేసుకోవడం వల్ల.. మన శరీరంలో పేరుకుపోయే కొలెస్ట్రాల్‌ను ఎప్పటికప్పుడు సహజసిద్ధంగా తగ్గించుకోవచ్చు.
1. తృణ ధాన్యాలు
వీటిల్లో ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉంటుంది. అలాగే మన శరీరానికి అవసరం అయ్యే కీలక పోషకాలు కూడా ఉంటాయి. ఇవి హైబీపీని తగ్గిస్తాయి. బీపీని నియంత్రణలో ఉంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. రీఫైన్ చేయబడిన పదార్థాలు కాకుండా.. తృణ ధాన్యాలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండడమే కాదు.. శరీరం మొత్తం సురక్షితంగా ఉంటుంది.
2. తక్కువ ఫ్యాట్ ఉన్న ప్రోటీన్లు
స్కిన్ లెస్ చికెన్, చేపలు, తక్కువ ఫ్యాట్ ఉండే పాలు, పాల ఉత్పత్తులు, కోడిగుడ్లు తదితర పదార్థాల్లో మన శరీరానికి శక్తినిచ్చే ఉత్తమమైన ప్రోటీన్లు ఉంటాయి. చేపల్లో పుష్కలంగా ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే కొవ్వులు, ట్రై గ్లిజరైడ్ల శాతాన్ని తగ్గిస్తాయి. వాల్ నట్స్, సోయా బీన్స్‌లోనూ ఈ ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగానే ఉంటాయి. అయితే కోడిగుడ్లను తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని అనుకుంటారు. కానీ అందులో నిజం లేదు. నిజానికి గుడ్లను తినడం వల్లే కొలెస్ట్రాల్ తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది.
3. పండ్లు, కూరగాయలు
పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మనం తినే ఆహారంలో ఉండే కొలెస్ట్రాల్‌ను చిన్నప్రేగులు రక్తంలోకి శోషించుకోకుండా ఉండేందుకు గాను ఫైబర్ దోహదపడుతుంది. కనుక ఫైబర్ ఎక్కువగా ఉండే పప్పులు, బీన్స్, చిక్కుళ్లు, పచ్చి బఠానీలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, చిలగడదుంపలు, బెండకాయలు, బ్రొకొలి, ఆపిల్స్, స్ట్రాబెర్రీలు తదితర పదార్థాలను నిత్యం తీసుకోవాలి. దీంతోపాటు సీజనల్ పండ్లను కూడా తింటే కొలెస్ట్రాల్‌ను సహజసిద్ధంగానే తగ్గించుకోవచ్చు.
4. నట్స్
పిస్తా, బాదంపప్పు, వాల్ నట్స్ తదితర నట్స్‌లో అన్ శాచురేటెడ్ ఫ్యాట్లు ఎక్కువగా, శాచురేటెడ్ ఫ్యాట్లు తక్కువగా ఉంటాయి. అందువల్ల అవి కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతాయి. నట్స్‌లో ఉండే ఫైబర్ శరీరంలో కొలెస్ట్రాల్ చేరకుండా చూస్తుంది. అలాగే వాటిలో ఉండే విటమిన్ ఇ, మెగ్నిషియం, పొటాషియం, స్టెరాల్స్ అనబడే పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటితో బరువు కూడా తగ్గవచ్చు.
5. ఓట్స్, బార్లీ
వీటిల్లోనూ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అలాగే అధిక బరువు తగ్గేలా చేస్తాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఓట్స్ అత్యుత్తమంగా పనిచేస్తాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది.
6. ఆరోగ్యకరమైన నూనెలు
నిత్యం మనం వంట కోసం వాడే నూనెల్లోనూ మార్పులు చేసుకోవాలి. ఆలివ్ ఆయిల్, ఆవ నూనె తదితర ఆరోగ్యకరమైన నూనెలను వాడితే వాటిల్లో ఉండే అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇక డాల్డా వంటి నూనెల వాడకాన్ని కూడా తగ్గించాలి. ఆరోగ్యకరమైన ఆయిల్స్‌లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. అవిసె గింజలను నిత్యం తినడం వల్ల మనకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. అయితే నాన్‌వెజ్ తినేవారు చేపలను తింటే ఆ పోషకాలను పొందవచ్చు.