MAA Elections 2021: ‘మా ‘ఎన్నికల సమరం తుది పర్వానికి చేరింది. సాధారణ ఎన్నికల కంటే ఎక్కువగా సెగలు రేపింది. గత నెల రోజులుగా ..సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు.. విమర్శలతో సాగిన ‘మా’ పోటీదారులకు నేడు అసలైన పరీక్ష. మా అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణుపోటీ పడుతున్నారు. ఈ తరుణంలో ‘మా’ సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయారు. సీనియర్ నటులు బాలకృష్ణ, కృష్ణంరాజు, కోటా శ్రీనివాసరావు, నరేష్ లు విష్ణుకు సపోర్టు చేస్తోండగా.. ప్రకాశ్ రాజ్‌కు మెగా ఫ్యామిలీ అండగా నిలిచింది. ఈ నేపథ్యంలో అధ్యక్షపీఠం ఎవ్వరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
అక్టోబర్ 10న హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో ‘మా’ ఎన్నికలు నిర్వహించనున్నారు. భారీ బందోబస్తు మధ్య పోలింగ్ సాగుతుంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది సాయంత్రం 4 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత రాత్రి 8 గంటల లోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. అనంతరం విజేతలెవరో అధికారంగా ప్రకటిస్తారు.
‘మా’ ఎన్నికల్లో 26 మంది కార్యవర్గం కోసం 54 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 925 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 883కి మందికి ఓటుహక్కు ఉంది. అయితే.. ‘మా’ అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీలో ఉండగా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి బాబుమోహన్, శ్రీకాంత్ లు ప పోటీలో ఉన్నారు. అలాగే.. వైస్ ప్రెసిడెంట్ పదవికి బెనర్జీ, హేమ, మాదాల రవి, పృథ్వీరాజ్ బరిలో ఉన్నారు. ఇక జనరల్ సెక్రటరీ పోస్టుకు జీవితా రాజశేఖర్, రఘుబాబు పోటీలో ఉన్నారు. అలాగే.. కోశాధికారి పదవికి శివబాలాజీ, నాగినీడు బరిలో ఉండగా, జాయింట్ సెక్రటరీ పదవులకు ఉత్తేజ్, అనితా చౌదరి, బచ్చల శ్రీనివాస్, గౌతమ్ రాజ్, కళ్యాణిలు పోటీలో నిలిచారు.
గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ‘మా’ ఎన్నికలు చాలా ఉత్కంఠగా జరుగుతున్నాయి. నువ్వా.. నేనా అంటూ సాగుతున్న మా పోరులో ఎవరు గెలుస్తారో వేచిచూడాలి ఈ రోజు రాత్రివరకూ. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 1994లో ఏర్పాటైన విషయం తెలిసిందే.