’మా‘ లో మరో మలుపు… కోర్టు మెట్లెక్కనున్న ప్రకాశ్ రాజ్ ప్యానెల్

అనేక వివాదాలకు, విమర్శలకు కేంద్రంగా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తర మలుపులు తిరుగుతోంది. ఎన్నికల ముందు మొదలైన రచ్చ ఎన్నికలు పూర్తయినా ముగియడం లేదు. మా ఎన్నికల్లో విష్ణు ప్యానెల్ గెలిచిన తర్వాత రోజు తర్వాత ప్రకాశ్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేయడం, ఆతర్వాత మొత్తం ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మూకుమ్మడిగా రాజీనామా చేయడంతో ’మా‘లో లుకలుకలు మరింత ఎక్కువయ్యాయి. 

తాజాగా మా ఎన్నిక మరోమలుపు తిరగబోతోంది. ఎన్నికల నిర్వహణ, ఎన్నికల్లో ఓట్ల కౌంటింగ్ పై ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కోర్టును ఆశ్రయించబోతోంది. మా ఎన్నికలు జరిగిన తీరుపై ప్రకాశ్ రాజ్ వర్గం తీవ్ర అసంత్రుప్తితో ఉంది. ఇప్పటికే ఎన్నికల అధికారిని సీసీ కెమెరా పుటేజీ కావాలని ప్రకాశ్ రాజ్ కోరారు. ఎన్నికల సమయంలో తమ ప్యానెల్ సభ్యులను బెదిరించారనే ఆరోపణలు చేస్తున్నారు. అన్ని ఆధారాలతో  సోమవారం రోజున మా ఎన్నికలపై కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. ఈవిషయమై గత రెండు రోజుల నుంచి ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మంతనాలు సాగించారు.