అదృష్టం అనేది జీవితంలో ఎవరికైనా సరే ఒక్కసారే తలుపు తడుతుంది. అది కూడా భారీ మొత్తంలో లాభం కలిగేలా అదృష్టం వరిస్తుంది.. అవును.. ఇప్పుడు చెప్పబోయే వార్తను వింటే మీరు కూడా అది నిజమేనని నమ్ముతారు. ఎందుకంటే… అతను ఎన్నో రోజుల నుంచి తీవ్రంగా శ్రమించాడు. వజ్రాల కోసం వెదికాడు. ఎట్టకేలకు అదృష్టం వరించింది. 6 నెలల శ్రమ అనంతరం ఏకంగా రూ.50 లక్షలు విలువ చేసే వజ్రం అతనికి దొరికింది. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా బుందేల్‌ఖండ్ ప్రాంతం వజ్రాల నిల్వలకు పెట్టింది పేరు. అక్కడ వజ్రాల గనులు ఉన్నాయి. అయితే అదే ప్రాంతంలో ఆనందిలాల్ కువ్‌వాహా (35) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి వజ్రాల కోసం వెదకడం మొదలుపెట్టాడు. 6 నెలలపాటు అతను తీవ్రంగా శ్రమించాడు. ఈ క్రమంలో ఎట్టకేలకు తాజాగా అతనికి వజ్రం దొరికింది. దాన్ని అతను స్థానికంగా ఉన్న డైమండ్ ఆఫీస్‌లో భద్రపరిచాడు. అధికారులు ఆ వజ్రానికి వెలకట్టగా అది రూ.50 లక్షల వరకు ఉంటుందని వెల్లడైంది.
అయితే ఆ వజ్రానికి గాను వేలం నిర్వహించి వచ్చే మొత్తం నుంచి ట్యాక్సులు, రాయల్టీని కట్ చేసి మిగిలిన మొత్తాన్ని ఆనందిలాల్‌కు అందజేస్తామని అధికారులు తెలిపారు. ఆ డైమండ్ సుమారుగా 10.69 క్యారెట్లు ఉంటుందని తెలిపారు. అది అరుదైన జాతికి చెందిన వజ్రం కనుక దానికి దాదాపుగా రూ.50 లక్షల వరకు ధర పలకవచ్చని, వేలంలో ఇంకా ఎక్కువ ధరే పలికేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఏది ఏమైనా.. ఆనందిలాల్ చాలా లక్కీ కదా..!