మహారాష్ట్ర సీఎం శిందే ప్రాణాలకు ముప్పు.. భద్రత పెంపు

-

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న సమాచారం మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్​కు శనివారం సాయంత్రం ఈ విషయమై స్పష్టమైన సమాచారం అందింది.

రాష్ట్ర ఇంటెలిజెన్స్ కమిషనర్ అశుతోష్‌ డుంబ్రే సైతం దీన్ని ధ్రువీకరించారు. ‘సీఎం శిందే ప్రాణాలకు ముప్పుపై మాకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అవసరమైన చర్యలు తీసుకున్నాం. ముఖ్యమంత్రి భద్రతను పెంచాం’ అని డుంబ్రే వెల్లడించారు. ఇప్పటికే ‘జడ్ ప్లస్’ కేటగిరీ భద్రతను కలిగి ఉన్న సీఎంకు అదనపు భద్రత కల్పించినట్లు చెప్పారు.

సీఎం ఏక్‌నాథ్ షిండే
సీఎం ఏక్‌నాథ్ షిండే

ముంబయిలోని అధికారిక నివాసం ‘వర్షా’తోపాటు ఠాణెలోని వ్యక్తిగత నివాసం వద్ద కూడా సెక్యూరిటీ పెంచినట్లు డుంబ్రే తెలిపారు. ఇదిలా ఉండగా.. అక్టోబరు 5న ముంబయిలోని ఎంఎంఆర్‌డీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న తొలి దసరా ర్యాలీలో శిందే ప్రసంగించనున్నారు. శివసేనలోని శిందే వర్గం ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే. తదనంతరం జూన్‌లో శిందే ముఖ్యమంత్రి అయ్యారు. నక్సల్‌ ప్రభావిత గడ్చిరోలి జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న సమయంలోనూ శిందేకు నక్సలైట్లు పంపినట్లు అనుమానిస్తోన్న ఓ బెదిరింపు లేఖ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news