సమాజంలో చిన్న మార్సును తేవాలంటే.. అందుకు మనం పెద్దగా కష్ట పడాల్సిన పనిలేదు. మన వంతుగా చిన్న ప్రయత్నం చేస్తే చాలు, మార్పు దానంతట అదే వస్తుంది. కొన్ని సార్లు మనం చేసే అలాంటి చిన్న ప్రయత్నాలే.. ఎంతో మందికి ఉపయోగపడతాయి కూడా. అవును.. సరిగ్గా అలాగే జరిగింది. మలేషియాలో ఆ గ్రామానికి చెందిన ఓ బాలిక మొబైల్ ఇంటర్నెట్ కోసం ఓ రోజంతా దట్టమైన అడవిలో చెట్టుపై గడిపింది. ఆన్‌లైన్ పాఠాల కోసం ఆ బాలిక ఆ సాహసం చేసింది. అయితే ఆమె అలా చేయడం ఏమోగానీ.. అధికారులు వెంటనే స్పందించారు. అక్కడ మొబైల్ ఇంటర్నెట్ మెరుగ్గా రావడం కోసం సిగ్నల్ పెంచే యత్నం చేస్తున్నారు.
మలేషియాలోని సబా అనే గ్రామానికి చెందిన ఓ బాలిక యూనివర్సిటీ మలేషియా సబాలో విద్యాభ్యాసం కొనసాగిస్తోంది. అయితే ఆమె ఉంటున్నది మారుమూల గ్రామంలో.. అక్కడ ఓ సెల్‌ఫోన్ టవర్ ఉన్నా.. అది కేవలం 3జి సిగ్నల్ మాత్రమే ఇస్తుంది. దీనికి తోడు తనలాగే ఇతర విద్యార్థులు కూడా అక్కడ చాలా మంది ఉన్నారు. దీంతో వారు ఆన్‌లైన్‌లో స్ట్రీమింగ్‌లో పాఠాలు నేర్చుకోవడం కష్టతరమైంది. కేవలం 4జి ఉంటే తప్ప వీడియో స్ట్రీమింగ్ ద్వారా పాఠాలు నేర్చుకోవడం కుదరదు. అయితే సిగ్నల్ కోసం ఆమె తమ గ్రామానికి సమీపంలోని దట్టమైన అడవికి వెళ్లింది. ఓ చెట్టుపై దోమతెర ఏర్పాటు చేసుకుని దానిపైనే రోజంతా గడిపింది. మొబైల్ ఫోన్‌లో ఆన్‌లైన్ పాఠాలు చూస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంది. ఆమెకు పరీక్షలు ఉండడంతో ఆమె నోట్స్ రాసుకుంది.
ఇక రోజంతా చెట్టుపై ఉండాలి గనుక ఆహారం, నీళ్లు, మొబైల్ ఫోన్‌లో చార్జింగ్ అయిపోతే బ్యాకప్ కోసం పవర్ బ్యాంక్, కూర్చునేందుకు కింద మ్యాట్ వంటి వస్తువులను కూడా ఆమె తన వెంట తీసుకెళ్లింది. అలా ఆమె రోజంతా చెట్టు పైనే గడిపింది. మరోవైపు అక్కడ రాత్రి పూట ఉండే దోమలు, తేనెటీగలను పోలిన పురుగులు ఆమెను భయానికి గురి చేశాయి. అయినా తప్పదు కదా.. అందుకని ఆమె భయపడకుండా ఎట్టకేలకు నోట్స్ పూర్తి చేసింది. ఆ సమయంలో ఆమె వీడియో కూడా తీసుకుంది. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో ఆ వీడియో వైరల్ కాగా.. స్పందించిన అక్కడి అధికారులు వెంటనే ఆ గ్రామంలో సెల్ టవర్‌ను 4జికి అప్‌గ్రేడ్ చేసి సిగ్నల్‌ను పెంచే పనిలో పడ్డారు. త్వరలో ఆ పనులు పూర్తి కానున్నాయి. ఇలా ఆ బాలిక చేసిన ఓ చిన్న ప్రయత్నం అక్కడి ఎంతో మంది విద్యార్థులకు మేలు కలిగేలా చేసింది.