తెలంగాణలోని హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతోన్న ఉప ఎన్నిక మాంచి రసవత్తరంగా మారుతోంది. ఇక్కడ ఎంతమంది అభ్యర్థులు పోటీ చేస్తున్నా ప్రధాన పోటీ మాత్రం అధికార టీఆర్ఎస్ వర్సెస్ విపక్ష కాంగ్రెస్ నేతల మధ్యే నడుస్తోంది. ఇక ఇక్కడ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పోటీ చేస్తుండగా… కాంగ్రెస్ నుంచి కోదాడ మాజీ ఎమ్మెల్యే, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి పోటీ చేస్తున్నారు.
రెండు పార్టీల నేతలు అక్కడే అందరిని మోహరించి హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ గవర్నర్‌కు చేసిన ఫిర్యాదు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో.. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతోంది. రాజ్యంగబద్ధ పదవిలో ఉంటూ, తన స్థాయిని మరిచిపోయి… హుజుర్ నగర్ ఉప ఎన్నికలో జోక్యం చేసుకుంటున్నారని ఉత్తమ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రతిరోజు కొంతమంది కాంగ్రెస్ నేతలను పిలుచుకొని భారీ మొత్తంలో డబ్బు పంపిస్తున్నారని ఆరోపించారు. పాలకవీడు నేతలకు ఇటీవలే డబ్బులిచ్చారని, రాష్ట్రంలో రాజ్యంగ పరిరక్షకురాలిగా మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ గవర్నర్ తమిళసైని కోరారు. గుత్తాకు అధికారపార్టీతో ఆర్థిక లావాదేవీలున్నాయని… గుత్తా కొడుకు, అల్లుడు పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల పనులు చేస్తున్నారని కూడా ఉత్తమ్ తన ఫిర్యాదులో తెలిపారు.
ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తే… తర్వాత మంత్రి మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డిని తప్పించి, తనను మంత్రిని చేస్తారని కూడా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. మండలి చైర్మన్‌గా ఉన్న గుత్తాపై ఉత్తమ్ చేసిన ఈ ఫిర్యాదుతో ఇప్పుడు టీఆర్ఎస్‌లో పెద్ద చర్చలే నడుస్తున్నాయి. గుత్తా నిజంగా అలా చేస్తున్నారా ? లేదా ఉత్తమ్ కలకలం రేపేందుకే ఇలా అన్నారా ? అన్నది చూడాలి. ఇక గుత్తా మంత్రి పదవి ఆశించిన సంగతి తెలిసిందే.