వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్ పోర్టు భూనిర్వాసితులు మంగళవారం ఆందోళనకు దిగారు. నక్కలపల్లి, గుంటూరుపల్లి, నల్లకుంట, గాడిపెల్లి గ్రామస్తులు నిరసన చేపట్టారు. సర్వే నిలిపేసి వెళ్లిపోవాలంటూ ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, తహసీల్దార్ నాగేశ్వర్ రావు, రెవెన్యూ అధికారులను రైతులు అడ్డుకున్నారు. తమ ఊరికి వచ్చే రోడ్డుకి ప్రత్యామ్నాయ మార్గం కావాలని, రైతులకు మార్కెట్ ధరకి తగినట్టుగా పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని తెలిపారు. అప్పుడు సర్వే చేసేందుకు అనుమతిస్తామని తేల్చిచెప్పారు.
జై జవాన్.. జైకిషాన్.. అని సుమారు 200 మంది రైతులు నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీగా మోహరించారు. ధర్నాకు అనుమతి లేదని ఆందోళన విరమించాలని పోలీసులు రైతులకు సూచించారు. అయినప్పటికీ అన్నధాతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.