ఏ సమస్యలు లేకుండా పూర్తి ఆరోగ్యవంతులుగా ఉన్నవారికి కరోనా వస్తే ఓకే. వారు ఇంట్లో ఉండి చికిత్స తీసుకునే కోలుకుంటారు. కానీ ఇతర ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కోవిడ్ వస్తే అలాంటి వారికి ప్రమాదం పొంచి ఉంటుంది. అలాంటి వారు కోవిడ్ వల్ల చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ముంబైకి చెందిన ఓ వ్యక్తికి అనేక అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కోవిడ్ సోకినా కేవలం 8 రోజుల్లోనే ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
ముంబైలోని కందివ్లి అనే ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల మహాదేవ్ హరి పటేల్‌కు ఇటీవలే కరోనా సోకింది. అతనికి 2018లో హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. అయితే తాజాగా కోవిడ్ బారిన పడడంతో అతనికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో అతన్ని అక్కడి ఓ హాస్పిటల్‌లో కుటుంబ సభ్యులు చేర్పించి అతనికి చికిత్స ఇప్పించారు. అయితే కోవిడ్ వల్ల అతని ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఎక్కువైంది. కిడ్నీల్లో సమస్యలు వచ్చాయి. కొంత ఆలస్యం అయి ఉంటే మెదడుకు ఇన్‌ఫెక్షన్ కూడా వచ్చేది. కానీ హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకున్నాడు. దీంతో ఆశ్చర్యంగా 8 రోజుల్లోనే అతను కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు.
కాగా మహాదేవ్‌కు హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ జరగడంతో ముందు అందరూ అతను బతకడం కష్టమని అనుకున్నారు. ఎందుకంటే అవయవ ట్రాన్స్‌ప్లాంట్ అయిన వారిలో ఆ అవయవాలను శరీరం తిరస్కరించకుండా ఉండేందుకు గాను ఇమ్యూనో సప్రెస్సంట్స్‌ను ఉపయోగిస్తారు. అంటే శరీర రోగ నిరోధక శక్తిని తక్కువ చేసే మందుల ఇస్తారు. దీని వల్ల శరీరం ట్రాన్స్‌ప్లాంట్ అయిన అవయవాన్ని తిరస్కరించకుండా ఉంటుంది. ఎవరికి ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ చేసినా ఈ పద్ధతినే అనుసరిస్తారు. దీంతో మహాదేవ్ కూడా సదరు మందులను వాడుతున్నాడు. అయితే దీని వల్ల అతని రోగ నిరోధక శక్తిని తక్కువగానే ఉంచి వైద్యులు కోవిడ్‌కు చికిత్స అందించాల్సి వచ్చింది. అయినప్పటికీ అతను 8 రోజుల్లోనే కోలుకోవడం వైద్యులనే షాక్‌కు గురి చేసింది. దీంతో అతన్ని ప్రస్తుతం హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేశారు. అయితే ఇది అత్యంత అరుదైన కేసుగా భావించిన ఆ హాస్పిటల్ వైద్యులు ఈ కేసు సంబంధించిన వివరాలను జర్నల్‌లో ప్రచురించేందుకు సిద్ధమవుతున్నారు. ఏమైనా.. అన్ని అనారోగ్య సమస్యలు ఉన్న అతను కోవిడ్ నుంచి కోలుకుని.. అది కూడా 8 రోజుల్లోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అవడం అంటే మాటలు కాదు.!