అమెరికా రక్షణశాఖకు సంబంధించిన అత్యంత కీలకమైన రహస్యాలు, యుద్ధ ప్రణాళికలకు సంబంధించిన పత్రాలు లీకైన విషయం తెలిసిందే. అయితే ఈ పత్రాలు ఓ వీడియో చాట్ రూమ్ నుంచి లీకైనట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. వాటిని లీక్ చేసిన వ్యక్తి తాజాగా అరెస్టు చేశారు. అతడిని అమెరికా ఎయిర్ నేషనల్ గార్డ్ జాక్ టెయిక్సిరా(21) అనే యువకుడిగా గుర్తించారు.
మస్సాచుసెట్స్‌లోని నివాసంలో ఉన్న జాక్‌ను ఎఫ్‌బీఐ అధికారులు ముట్టడించి అదుపులోకి తీసుకొన్నారు. అతడిపై గూఢచర్యం నేరం మోపారు. జాక్.. మస్సాచుసెట్స్ 102 ఎయిర్ నేషనల్ గార్డ్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. పశ్చిమ కేప్కోడ్లోని ఒటిస్ నేషనల్ ఎయిర్గార్డ్స్ కార్యాలయంలో సైబర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ జర్నీమన్గా విధులు నిర్వహిస్తున్నాడు. అజాక్ పనిచేసే ఇంటెలిజెన్స్ విభాగం అత్యంత కీలకమైంది. ఇక్కడ పనిచేసేవారికి అమెరికాలోని అత్యంత రహస్య పత్రాలను చూసే అవకాశం ఉంటుంది. వీటిల్లో మ్యాప్‌లు, విశ్లేషణ పత్రాలు వంటి ఉంటాయి.
అమెరికా సైన్యంలోని 600 మందికిపైగా అధికారులకు టాప్ సీక్రెట్ క్లియరెన్స్‌లు ఉన్నాయి. అదే సమయంలో వారి సహాయకులు, పెంటగాన్‌లో పనిచేసే చాలా మంది కర్నల్స్, యుద్ధనౌకల్లోని కెప్టెన్లు, జూనియర్ ఆఫీసర్లు, ఇంటెలిజెన్స్ వింగ్‌లో పనిచేసే సభ్యులకు ఇటువంటి క్లియరెన్స్‌లు లభించాయి. జాక్‌కు కూడా ఇలానే యాక్సెస్ లభించినట్లు తెలుస్తోంది.