కరోనా లాక్ డౌన్ ఏమో గాని సామాన్యులకు మాత్రం వైద్య సదుపాయాలు అందడం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ ని చాలా కఠినం గా అమలు చేస్తున్నారు. దీనితో ఇతర వైద్య సదుపాయాలు చాలా మందికి అందడం లేదు. ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నా సరే చాలా మంది వైద్యానికి దూరం అవుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు వృద్దులు ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది ప్రస్తుతం. వాహనాలు లేక అనారోగ్యం తో ఉన్న వారిని చేతులతో మోసుకుని వెళ్ళే పరిస్థితి. తాజాగా అనంతపురం లో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురదకుంటకి చెందిన రామక్కకు 3 రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీనితో కుమారుడు రవి తల్లిని తీసుకుని గురువారం ఆటోలో వచ్చారు.
అయితే లాక్ డౌన్ కారణంగా ఆటో ని అనుమతించలేదు అధికారులు. దీనితో ఆమెను ఎలా తీసుకుని వెళ్ళాలో అర్ధం కాక ఇబ్బంది పడ్డాడు. ఇక చేసేది లేక తల్లిని వీపుపైన ఎత్తుకుని రెండు గంటల పాటు వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగినా సరే ఫలితం లేకుండా పోయింది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించి ఇంటికి తిరిగి తీసుకుని వెళ్ళాడు.