12 లక్షలకే 30 తులాల బ్రిటిష్‌ బంగారం.. అగ్రిమెంట్ చేసి మరీ !

అడుగడుగునా మోసగాళ్ళు ఉంటారని జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించినా ఈజీ మనీ వస్తుంది కదా అని కొంత మంది టెంప్ట్ అయి మోసపోతున్నారు. చివరికి మళ్ళీ పోలీసులనే ఆశ్రయిస్తున్నారు. తాజాగా అలానే తెలంగాణాలోని మెదక్‌ జిల్లాలో తక్కువ ధరకే బంగారం బంగారం ఇస్తానని ఏకంగా 4 లక్షలు కొట్టేశాడు ఓ కేటుగాడు. బ్రిటీష్‌ కాలం నాటి నాణేలు చవకగా వస్తాయని చెప్పిన కేటుగాడు నిండా ముంచాడు.

యూసఫ్‌ పేటకు చెందిన బుచ్చయ్యకు 30 తులాల బంగారం పన్నెండు లక్షలే ఇస్తానని రమేష్‌ నమ్మించాడు. 12 లక్షలకు 30 తులాల బంగారం అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. 4 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చి మిగిలిన డబ్బు నెలకు లక్ష చొప్పున ఇచ్చేలా రమేష్‌ తో అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు బుచ్చయ్య. అయితే రమేష్ ఇచ్చిన ఆ బంగారం నకిలీదని తేలడంతో షాక్‌కు గురయ్యాడు. ఏం చేయాలో అర్థంకాక చివరికి పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.