Telangana : నేడు ‘మన ఊరు – మన బడి పథకం’ పాఠశాలలు ప్రారంభం

-

తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం కింద పనులు పూర్తయిన పాఠశాలలను ఇవాళ ప్రారంభించనున్నారు. ప్రస్తుతానికి 680 పాఠశాలలు సిద్ధం కావడంతో వాటిని బుధవారం ఒకేసారి మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రారంభించాలని నిర్ణయించారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ నుంచి పీజీ విద్యా ప్రాంగణాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.

తొలి విడతలో రాష్ట్రంలోని 9,123 పాఠశాలలను ఎంపిక చేసిన ప్రభుత్వం రూ.3,497 కోట్లతో 12 రకాల సౌకర్యాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత మార్చిలో సీఎం కేసీఆర్‌ వనపర్తిలో కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మండలానికి కనీసం రెండు చొప్పున 1210 పాఠశాలలను ప్రారంభించాలని రెండు మూడు నెలలుగా అధికారులు కృషి చేస్తున్నారు.

ఈ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, మరమ్మతులు, డిజిటల్‌ విద్య అందించేందుకు పరికరాలు, ప్రహరీలు, వంట గది, డ్యూయల్‌ డెస్కులు, ఉన్నత పాఠశాలలైతే భోజనశాలలు తదితర 12 రకాల సౌకర్యాలు కల్పించారు. సుమారు మరో 600 పాఠశాలలను కొద్ది రోజుల్లోనే ప్రారంభిస్తామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news