ఝార్ఖండ్ ధన్బాద్లోని అపార్ట్మెంట్లో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటనపై మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.
ధన్బాద్లోని జోడా పాఠక్ ప్రాంతంలోని ఆశీర్వాద్ టవర్ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 14 మంది సజీవదహనం కాగా.. మరికొంత మంది మంటల్లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అపార్ట్మెంట్లో 400 మంది ఉంటున్నట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. వెంటనే మంటలు ఆర్పే ప్రక్రియ ప్రారంభించాయి. మృతుల్లో నలుగురు చిన్నారులు సైతం ఉన్నారని అధికారులు చెప్పారు.