సైనికుల ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన అగ్నిపధ్ పథకం పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. యువకుల ఆగ్రహంతో రైల్వేస్టేషన్లు, జాతీయరహదారులూ, యుద్ధ క్షేత్రాలుగా మారిపోయాయి. నిరసనకారులు పోలీసులతోనూ బాహాబాహీకి దిగారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటు సైనిక ఉద్యోగార్థులు పలు రాష్ట్రాల్లో విధ్వంసానికి పాల్పడ్డారు. రైళ్లకు నిప్పంటించారు. రహదారులపై, రైలు మార్గాల్లో బైఠాయించారు.
బీహార్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, హర్యానా లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కాగా అగ్నిపధ్ పథకానికి వ్యతిరేకంగా చాలా పార్టీలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నాయి.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పై మావోయిస్టు పార్టీ స్పందించింది. నాజీల పాలన తలపించేలా కేంద్రం పాలన ఉందని మావోయిస్టు పార్టీ ఆగ్రహించింది. అగ్నిపధ్ ను వెంటనే ఆపాలని, దీనిపై పోరాటం చేస్తున్న వారికి తమ మద్దతు ఉంటుందని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.