అమ్మాయిల వివాహ వయస్సు 21కి పెంచుతూ.. కేంద్ర కేబినెట్ ఆమోదం…!

-

ఇకపై అమ్మాయిలు, అబ్బాయిల వివాహ వయస్సు సమానం కాబోతోంది. అమ్మాయిల వివాహ వయస్సు 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బాల్యవివాహాల నిరోధక చట్టం 2006 చట్టానికి సవరణలు చేసింది కేంద్రం. 2020 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… అమ్మాయి పెళ్లి వయసును 21సంవత్సరాలకు పెంచుతామని హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగానే తాజాగా కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ సమావేశాల్లో పార్లమెంట్ లో బిల్లు పెట్టే అవకాశం ఉంది.

ప్రస్తుతం దేశంలో అమ్మాయిల వివాహ వయస్సు 18 ఏళ్లుగా ఉంటే.. అబ్బాయిల వివాహ వయస్సు 21 ఏళ్లుగా ఉంది. దీనిపై గతంలో  కూడా పలుమార్లు చర్చ జరిగింది. అమ్మాయిల వివాహ వయస్సు తక్కువగా ఉండటం వల్ల వాళ్ల కెరీర్ కు విఘాతం కలుగుతుందని.. చిన్నవయస్సులోనే గర్భం దాల్చడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు వాదిస్తున్నారు. అందుకే వివాహానికి అమ్మాయిల కనీస వయసు కూడా 21ఏళ్లకు పెంచాలని పలువురు కోరారు. ఇందుకోసం గతేడాది జూన్‌లోనే నీతి ఆయోగ్‌ టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. దీనికి జయ జైట్లీ నేతృత్వం వహించగా.. ప్రభుత్వ నిపుణులు డాక్టర్‌ వీకే పాల్‌, ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమశాఖ, న్యాయ మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్‌ అధికారులు దీనిలో సభ్యులుగా ఉన్నారు. ఈ టాస్క్‌ఫోర్స్‌ దేశవ్యాప్తంగా సర్వేలు చేపట్టి అభిప్రాయాలు సేకరించింది. సర్వేలో వెల్లడైన అభిప్రాయాల ప్రకారం అమ్మాయిలు గర్భం దాల్చే సమయానికి కనీస వయస్సు 21 ఏళ్లకు ఉండాలని సూచించింది. 21 ఏళ్ల లోపే పెళ్లిళ్లు జరిగితే సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా ప్రభావం చూపే అవకాశం ఉందని టాస్క్ ఫోర్స్ వెల్లడించింది. దీనికి అనుగుణంగానే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news