ఆహార పంట అంటే ముఖ్యంగా వరి పేరు వినిపిస్తోంది..ఈ పంట వేసిన తర్వాత ఎన్నో చీడపీడలు,తెగుల్లు కూడా వస్తాయి.పంట చేతికి అందుతుందన్న సమయంలో వరి పంటకు తెగుళ్లు సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.దోమ పోటు, అగ్గి తెగులు, పొడ తెగులు, పచ్చ పురుగు లాంటి తెగుళ్లు చేనును పూర్తిగా నాశనం చేస్తాయి. ఈ చీడపీడల ఉధృతిని గమనిస్తూ, వివిధ దశలలో పంటపై రోగ లక్షణాలను గుర్తించి సరైన నివారణ చర్యలను తీసుకోవాలి..లేకుంటే మాత్రం తీవ్రంగా నష్ట పోవాల్సిందే..
వరి చేనులో అగ్గి తెగుళ్లతో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పొలంలో ముందురోజు కొద్దిగా కనిపించే అగ్గి తెగులు మరుసటి రోజుకు మడి మొత్తం వ్యాపించి పంటను నాశనం చేస్తుంది. ఈ తెగులు రావడంతో పంటంతా ఎండిపోయి ఒట్టిగడ్డి మాదిరిగా కనిపిస్తోంది. వరి పంటపై ఏదశలోనైనా ఇది ఆశించవచ్చు. వరి ఆకుల మీద, వెన్ను మెడ భాగాల మీద, ఆకులపై నూలుకండె ఆకారం కలిగిన గోధుమ రంగు అంచులు గల మచ్చలు ఏర్పడతాయి. మచ్చల మధ్యలో బూడిద రంగు ఉంటుంది. పిలకల కణుపుల వద్ద ఆశిస్తే ఆ ప్రదేశం వద్ద పిలక విరిగి వాలి పోతుంది. తెగులు సోకిన వెన్ను మెడ దగ్గర నల్లటి మచ్చలు ఏర్పడి వెన్ను విరిగి వేలాడుతూ కనిపిస్తుంది. తెగులు సోకిన మొక్కల్లో ఎక్కువ తాలుగింజలు ఏర్పడతాయి. ఈ తెగులు ఉధృతి ఖరీఫ్ కన్నా రబీలో ఎక్కువగా ఉండి పంటకు తీవ్రనష్టాన్ని కలిగిస్తుంది..
ఈ తెగులు నివారణకు..విత్తనశుద్ధికి 1 కిలో విత్తనానికి 3 గ్రా. కార్బెండిజమ్ మందును కలిపి విత్తనశుద్ధి చేయాలి. తెగులు తట్టుకునే రకాలైన వరం (యం. టి.యు 1190), సుజాత(యం. టి. యు 1210), నెల్లూరు సిరి(ఎన్. యల్. అర్ 4001) నెల్లూరి మసూరి (ఎన్. యల్. అర్ 3449), వంశధార ,శ్రీదృతి వంటి రకాలను వేసుకోవాలి. రాశి, ఐఆర్ 64, ఎ స్‌ఆర్ 34449, ఎ స్‌ఆర్ 3014 మరియు యమ్ టియు 1001 రకాలను సాగుచేయాలి. సిఫారసు చేసిన నత్రజనిని 3-4 సార్లు వేయాలి.
తెగులు సోకిన పొలంలో 5 శాతం ఆకులు నష్టపోయినచో ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా/లీ. లేదా కాసుగామైన్ 2.5 మి.లీ./లీ. లేదా ఐసోప్రోథయోలిన్ 1.5 మి.లీ./లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.. మొదట్లోనే ఈ తెగులును గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి..లేకుంటే తీవ్ర నష్టాన్ని చూడాల్సి వస్తుంది.ఇంకేదైనా సమాచారం కావాలంటే దగ్గరలోని వ్యవసాయ నిపునులను అడిగి తెలుసుకోవడం మేలు..