చిరంజీవి తన తండ్రితో నటించిన సినిమా గురించి మీకు తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి, తన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమాల గురించి అందరికీ తెలుసు. మగధీర, బ్రూస్ లీ, ఖైదీ నంబర్ 150 సినిమాల్లో మెగాస్టార్ మెరిసారు. తన కొడుకుతో తెర పంచుకున్న మెగాస్టార్, తన తండ్రి వెంకట్రావు గారితో కూడా నటించారు. తండ్రి వెంకట్రావు గారికి నటన మీద ఆసక్తి ఎక్కువ. అప్పట్లో జగత్ కిలాడీ అనే సినిమాలో కనిపించారు. ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు మీద పడడంతో నటనవైపు రాలేకపోయారు.

కానీ చిరంజీవి సినిమాల్లోకి వచ్చాక మంత్రి గారి వియ్యంకుడు సినిమాలో తండ్రి వెంకట్రావుగారు కూడా నటించారు. బాపు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మంత్రిగారి వేషం కోసం వెతుకుతుంటే, అల్లు రామలింగయ్య గారు వెంకట్రావు గారిని సజెస్ట్ చేసారట. ఈ సినిమాలో చిరంజీవికి, తన తండ్రిగారికి మధ్య మాటలేమీ ఉండవు. కనీసం ఒకే తెర మీద కనిపించరు. కానీ తన కొడుకు సినిమాలో నేను కూడా నటించానన్నా తృప్తి వెంకట్రావుగారికి మిగిలింది.