ఆఖరి ఘట్టానికి గ్రేటర్ ప్రచారం..గేర్ మార్చిన కమలదళం

-

గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ… ఆ రేంజ్‌లోనే ప్రచారం నిర్వహిస్తోంది. పార్టీ అగ్ర నేతలు క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం నిర్వహిస్తున్నారు.ఇలా గ్రేటర్‌ ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ నేతలు క్యూ కడుతున్నారు. రోజుకో నేత క్యాంపెయిన్‌కు వస్తున్నారు. మూడు రోజుల్లో ప్రచారానికి తెరపడనుండటంతో… వరుస పర్యటనలతో ఎన్నికల వేడి మరింత పెంచుతున్నారు.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, హోంమంత్రి అమిత్‌షా కూడా గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నారు. వీరితో పాటు పార్టీలోని వివిధ సామాజిక వర్గాల నేతలు… తమ సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులతో సమావేశమై… ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేయాలని కోరుతున్నారు. జనసేన శ్రేణులు కూడా బీజేపీ ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఆ పార్టీ నేతలు నిర్వహిస్తున్న రోడ్ షోల్లో… జనసేన జెండాలు కనిపిస్తున్నాయి.

ప్రధాని మోడీ రేపు హైదరాబాద్‌లో పర్యటించబోతున్నారు. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను పరిశీలించేందుకే ఆయన హైదరాబాద్‌కు వస్తున్నారని చెబుతున్నా… LB స్టేడియంలో కేసిఆర్ బహిరంగ సభ ఉన్న సమయంలోనే మోడీ కార్యక్రమం ఉండటంతో టీఆర్ఎస్ కి కౌంటర్‌గానే బీజేపీ ప్రధాని టూర్‌ను ప్లాన్‌ చేసిందనే చర్చ జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో రేపు కీలకమైన రోజు. ఆదివారం ప్రచారం ముగియనుండటంతో… ముందురోజే అగ్రనేతల కార్యక్రమాలు ప్లాన్‌ చేశాయి.

గ్రేటర్ ఎన్నికలతో కానీ, ప్రచారంతో కానీ మోడీకి నేరుగా సంబంధం లేకపోయినా… హైదరాబాద్‌లో ఆయన పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. సాధారణంగా ప్రధానికి సంబంధించిన ఏ పర్యటన అయినా.. రెండువారాల ముందు ఖరావుతుంది. కానీ, ఈ టూర్‌ ఆకస్మికంగా ఖరారైంది. దీంతో, మోడీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. కేసీఆర్‌ సభతో ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్న టీఆర్‌ఎస్‌కు కౌంటర్‌గానే… ప్రధాని పర్యటనను బీజేపీ ప్లాన్‌ చేసి ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news