ఇంగ్లీషు బాగా మాట్లాడగలదు మేఘన. అందుకు ఆ పాఠశాల.. ఆ టీచరు ఎంతో కారణం అయి ఉన్నారు. ఇప్పుడు మేఘనను కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఎందుకో తెలుసా జగనన్నతో ఆ రోజు ఆమె మాట్లాడడమే తప్పయిపోయింది. ఎన్ని మార్కులు వచ్చి ఉంటాయి..అసలు ఆమె పాస్ అయిందా లేదా అని..తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇతరుల జీవితాలు మనకు మరీ అంత ముఖ్యం అయిపోయాయి కదా! అందుకే మన జీవితాలు ఏ ఓదార్పూ లేకుండా ఉన్నాయి.ఆ బుజ్జాయి చదువు బాగుంది మన ఆలోచనలే బాగాలేవు. దిద్దుంకుంటే ట్రోలింగులు ఆపేస్తే మనం కూడా మంచి మార్పు దిశగా అడుగులు వేయడం ఖాయం. డియర్ మేఘనా ఆల్ ద బెస్ట్.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, తొండంగి మండలం, బెండపూడి జెడ్పీ హైస్కూల్ ..గుర్తుందా.. ఆ రోజు ఆ పాఠశాల పిల్లలు సీఎంతో అనర్గళంగా మాట్లాడి ప్రశంసలు అందుకున్నారు. ఆ తరువాత ఫలితాలు వచ్చాక వాళ్లలో మేఘన ఎక్కువగా ట్రోల్ అవుతోంది. సీఎంతో అంత బాగా ఇంగ్లీషు మాట్లాడింది కదా! ఆ చిన్నారికి ఇంగ్లీషులో ఎన్ని మార్కులు వచ్చాయి అని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పాపం ! ఆ బిడ్డ ఏం చేసిందని ఈ విధంగా చేస్తున్నారని? అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని మామా అని సంబోధిస్తూ పిలవడమే తప్పా! లేదా ఇంగ్లీషులో మాట్లాడడమే తప్పా!
ఏదేమయినా ఆ చిన్నారి మార్కులు ఆమె జీవితం ఆమె వ్యక్తిగతం కదా! అయినా ఓ సైట్ నిర్వాహకులు అతి చేస్తూ మేఘన పేరు తెగ ట్రోల్ చేసింది. అయితే మేఘనకు ఇంగ్లీషులో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా 91. మొత్తం ఆమె సాధించిన మార్కులు 478. తెలుగులో 84, హిందీలో 75, ఇంగ్లీషులో 91, మ్యాథ్స్ లో 79, సైన్స్-లో 78, సోషల్ లో 71 మార్కులు వచ్చాయి. ఇప్పుడు చెప్పండి..ఆ చిన్నారి మంచి చదువరే కదా ! ఎందుకని మనం అదే పనిగా ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడడం. ఆ చిన్నారి అనే కాదు ఇవాళ ఏ చిన్నారి జీవితం అయినా ముఖ్యమే ! పదో తరగతి తప్పినంత మాత్రాన ప్రపంచం కూలిపోదు. సూర్య చంద్రుల గతి మారిపోదు.
పిల్లలూ ! మీరు ధైర్యంగా ఉండండి.
మీ విజయాలను మీ తల్లిదండ్రులు చూసి పొంగిపోవచ్చు అదే తల్లిదండ్రులకు కాస్త ఓటములను భరించే శక్తిని కూడా ఇవ్వమని దైవాన్ని వేడుకుందాం. వారే కాదు ఎవ్వరూ ఫెయిల్యూర్స్ కాదు. తల్లిదండ్రులూ ! మీరు మీ బిడ్డల గెలుపే ముఖ్యం అనుకోవడం కాస్త తగ్గిస్తే, అసలు ఆ తరహా ఆలోచనలే మానుకుంటే ఆత్మహత్య లు అన్నవి ఉండనే ఉండవు. బిడ్డల చదువులు ఇప్పుడు ముఖ్యం..వారి ప్రాణాలు..వారితో పెనవేసుకున్నమీ ప్రేమలు..అభిమానాలు కూడా ముఖ్యమే!