హైదరాబాద్ లో మెట్రో రైలు అయితే వచ్చింది కానీ.. మెట్రో పాస్ కోసం నగర వాసులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందుకే… పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ మొత్తాన్ని కనెక్ట్ చేసే విధంగా ఉమ్మడి పాస్ ను తీసుకొచ్చేందుకు ముందడుగు పడింది. మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్, ఆటోలు.. ఇలా నాలుగు రకాల రవాణా సాధనాల్లో చెల్లు బాటు అయ్యేలా ఉమ్మడి పాసును తీసుకురాబోతున్నారు.
వచ్చే జనవరి చివరి కల్లా ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనున్నారు. ముందుగా… కొన్ని మెట్రో స్టేషన్లు, బస్సులు, ఆటోల్లో పరీక్షించనున్నారు. వీటన్నింటిలో చెల్లుబాటు అయ్యేలా ఓ కార్డును రూపొందించనున్నట్టు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిటాచీ కన్సార్టియంతో కలిసి ఈ కార్డును రూపొందించనున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే… అన్ని మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్, ఆటోల్లో ఉమ్మడి పాస్ ను ప్రవేశపెట్టనున్నారు.