కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్రిపథ్ స్కీంపై దేశ్యాప్తంగా నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళన కారులు వింధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు చేసిన నిరసనలతో ముందస్తు జాగ్రత్తగా హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులను రద్దు చేశారు. సికింద్రాబాద్ స్టేషన్లో ఉద్రిక్తతలు చల్లారడంతో ఆగిపోయిన మెట్రో రైళ్లు మళ్లీ సేవలు ప్రారంభించాయి. సాయంత్రానికి మెట్రో రైళ్లు పరుగులు తీశాయి. ఉదయం నుంచి మెట్రో సర్వీసులు నిలిచిపోవడంతో ఆఫీసులు, కాలేజీలు, వివిధ పనుల కోసం బయటకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఎంఎంటీఎస్ సేవలు కూడా నిలిచిపోవడంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ నెలకొంది. దీంతో మెట్రో సేవలు తిరిగి ప్రారంభం కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. నిరసనకారులను ఒక్కొక్కరుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో 8 రైలు ఇంజిన్లు ధ్వంసమైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. సుమారు రూ.30 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో సికింద్రాబాద్ నుంచి రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రాత్రి 7.40కి లింగంపల్లి-కాకినాడ ట్రైన్ బయల్దేరనుంది. అలాగే రాత్రి 8.20 గంటలకు విశాఖ-గరీబ్ రథ్ రైలు బయలుదేరనుంది.