ఒక పక్క కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ పోలీసులు నానా కష్టాలు పడుతున్నారు. ప్రజలు ఎవరిని కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు పడుతూ వైద్యుల రక్షణ కోసం కూడా తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ తరుణంలో కొందరు అనవసరంగా హడావుడి చేస్తున్నారు. నేరాలు లేని సమయంలో కొందరు అతి చేస్తున్నారు. పోలీసులు ఇబ్బంది పడుతున్న తరుణంలో మరింత ఇబ్బంది పెడుతున్నారు.
తాజాగా హైదరాబాద్ లోని పాత బస్తీ లో జరిగిన ఒక గొడవ హైదరాబాద్ పోలీసులకు ఆగ్రహం తెప్పించింది. రెండు గ్యాంగ్‌లు పాతబస్తీ ప్రాంతంలో గొడవకు దిగాయి. రెండు గ్యాంగ్‌లు ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు. రాత్రి వేళ కర్ఫ్యూ అమలులో ఉంది. ప్రజలు అందరూ ఇళ్లకే పరిమితం అయిన తరుణంలో లాక్ డౌన్ ని లెక్క చేయకుండా… కర్ఫ్యూ ని లెక్క చేయకుండా గొడవలకు దిగారు.
ఈదిబజార్‌లో జరిగిన ఈ గొడవపై పోలీసులు ఇప్పుడు ఆగ్రహంగా ఉన్నారు. మాటా మాట పెరిగి ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకున్నారు. కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణ లో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ ఘర్షణలో పాల్గొన్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేయగా కొందరు పారిపోయారు.