ధైర్యానికి కేరాఫ్ అడ్రస్ జగన్.. త్వరలోనే విశాఖకు రాజధాని : ఏపీ మంత్రి

గుంటూరు : మరోసారి రాజధాని తరలింపుపై మంత్రి అవంతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలనా రాజధాని విశాఖకు త్వరలోనే వెళ్తుందని… విశాఖకు వెళ్లడానికి డేట్, టైమ్ లేదని ఆయన పేర్కొన్నారు. ఎక్కడ జరగాల్సిన అభివృద్ధి అక్కడ జరుగుతుందని… అమరావతి ఎక్కడికీ పోదని స్పష్టం చేశారు మంత్రి అవంతి. పరిపాలనా రాజధాని తరలింపు చట్టప్రకారమే జరుగుతుందని… మాకు కోర్టులంటే గౌరవం ఉందన్నారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమని.. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రాంతానికో ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదని వెల్లడించారు.

భవిష్యత్తులో విభజనవాదం రాకూడదనే ఈ ఆలోచన అని.. ధైర్యానికి కేరాఫ్ అడ్రస్ సీఎం జగన్ అని స్పష్టం చేశారు మంత్రి అవంతి. రానున్న రోజుల్లో ఏపీని అభివృద్ధి బాటలో నడపటమే.. సీఎం జగన్‌ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. కాగా.. గత కొన్ని రోజులుగా విశాఖపై దృష్టి పెట్టింది ఏపీ సర్కార్‌. ఇప్పటికే పలు అభివృద్ధి పనుల కోసం నిధులను కూడా మంజూరు చేసింది. అలాగే.. గత వారం రోజులుగా ఏపీ మంత్రులు సైతం…ఏ క్షణమైన విశాఖకు రాజధాని వెళుతుందని ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే.