తెలంగాణ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఉపాధ్యాయులపై ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందంటూ చేసిన వ్యాఖ్యలపై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. వాస్తవాలేమిటో తెలుసుకోకుండా హరీశ్ రావు మాట్లాడటం సరికాదని బొత్స కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు హరీశ్ రావు వ్యాఖ్యలను ఖండిస్తూ బొత్స పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నారని బొత్స అన్నారు. హరీశ్ రావు ఒక సారి ఏపీకి రావాలని, ఇక్కడి టీచర్లతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు మంత్రి బొత్స. తెలంగాణ, ఏపీ పీఆర్సీలు పక్కపక్కనే పట్టుకుని చూస్తే తేడా తెలుస్తుందని బొత్స వ్యాఖ్యానించారు. అయినా హరీశ్ రావు తమ ప్రభుత్వంపై మాట్లాడి ఉండకపోవచ్చని అన్నారు మంత్రి బొత్స. ఇదిలా ఉంటే.. విశాఖలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం కడితే తప్పు ఏంటో చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
విశాఖలో మాట్లాడిన ఆయన… ముఖ్యమంత్రి కార్యాలయం రుషికొండపై కడితే తప్పు ఏమిటని నిలదీశారు. రుషికొండలో మరో గెస్ట్ హౌస్ కడుతున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణకు భంగం కలిగితే ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. సీఎం జగన్ గడపగడపకు ప్రభుత్వం వర్క్ షాప్ పై అత్యుత్సాహం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 175 సీట్లు టార్గెట్ గా పెట్టుకోకూడదా? అని ప్రశ్నించారు. సంక్షేమంపై ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చామన్నారు. ఏవో ఒకటి రెండు ఉద్యోగులు విషయాల్లో పెండింగ్ ఉన్నాయన్నారు.