పెట్టుబడులన్నీ ఒకే ప్రాంతంలో పెడితే ప్రాంతీయ విభేదాలు వస్తాయని అన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానుల అంశం విశాల ప్రయోజనాలతో కూడుకున్నదని తెలిపారు. అయితే ప్రభుత్వం శివరామకృష్ణ కమిటీ సిఫారసులని అమలు చేస్తుందన్నారు మంత్రి ధర్మాన. గత ప్రభుత్వం రాజధాని నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టును పట్టించుకోలేదని ఆరోపించారు.
అభివృద్ధి వికేంద్రీకృతం అవ్వడానికే ఈ ప్రభుత్వం మూడు రాజధానులను నిర్ణయించిందని.. వికేంద్రీకరణ అజెండా తోనే రానున్న ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం బుట్ట దాఖలు చేసిన శివరామకృష్ణ కమిటీ నివేదికను వైసీపీ అమలు చేస్తుందన్నారు. మూడు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యం అయిన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని తెలిపారు.