మునుగోడు ఉపఎన్నిక ప్రచార గడువు సమీపిస్తోంది. అధికార టీఆర్ఎస్ ప్రచారం ముమ్మరం చేసింది. ఇంటింటికి తిరుగుతూ.. రోడ్ షోలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ మతతత్వ పార్టీ అని, ప్రజల మధ్య చిచ్చుపెట్టి విచ్ఛిన్నం చేయడమే ఆ పార్టీ విధానమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు మద్దతుగా చండూరు మున్సిపాలిటీలో మంత్రి ఎర్రబెల్లి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ రవీందర్ రావు, వరంగల్ కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, మున్సిపాలిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీజేపీ ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని, పైగా మరిన్ని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రజలు బీజేపీని నమ్మొద్దని, టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు మద్దతుగా నిలవాలని ఓటర్లను కోరారు.