కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తోన్న నూతన జాతీయ విద్యుత్ విధానంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. ఈ ముసాయిదాను రాష్ట్రాలకు పంపడంపై తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రం ఎన్ని కొత్త విధానాలు తీసుకొచ్చినా.. రాష్ట్రాలపై ఎంత నిరంకుశత్వం చూపించినా.. ఉచిత విద్యుత్ పంపిణీలో తెలంగాణ తగ్గేదేలే అంటూ స్పష్టం చేశారు.
ఈ సంస్కరణలపై ఇప్పటికే సీఎం కేసీఆర్ తన వైఖరి ఏంటో స్పష్టం చేశారని మంత్రి గుర్తు చేశారు. దేశంలో ఉన్న వివిధ సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని సామాజిక, ఆర్థిక సమతుల్యం లేని వర్గాలకు తప్పకుండా సబ్సిడీలు ఉండాలని బీఆర్ఎస్ భావిస్తోందని మంత్రి తెలిపారు. పేద ప్రజలకు అందించే ఉచిత విద్యుత్తు నిలిపేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. ఉచిత విద్యుత్ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపసంహరించుకునేది లేదని తేల్చి చెప్పారు.
“నూతన జాతీయ విద్యుత్ సంస్కరణలపై నాడే సీఎం కేసీఆర్ కుండబద్ధలు కొట్టారు. కొన్ని వర్గాలకు ఉచితంగా కరెంట్‌ను అందిస్తున్నారు. కేంద్రం మోటరుకు మీటరు ఉంచాలని భావిస్తోంది. ఇది తెలంగాణలో జరగదు.”- జగదీశ్ రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి