బుధవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు లో ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో కార్యకర్తలు బాణాసంచా పేల్చడంతో పక్కనే ఉన్న గుడిసెకు నిప్పపట్టుకుని దగ్ధమైంది. మంటల వల్ల గుడిసెలోని సిలిండర్ పేలి ఒకరి మృతిచెందగా మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు దాటికి పలువురికి కాళ్లు, చేతులు తెగిపడ్డాయి.
దీంతో బాధిత కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఈ ఘటనపై తాజాగా మంత్రి కేటీఆర్ స్పందించారు. చీమలపాడు లో జరిగిన అగ్నిప్రమాదంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా అధికారులు, నాయకులతో ఫోన్ లో మాట్లాడారు మంత్రి కేటీఆర్.