తెలంగాణలో జర్నలిస్టులకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ అంశం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనలో ఉందన్నారు. అసెంబ్లీలో గురువారం మంత్రి కేటీఆర్‌ను డెక్కన్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్‌ఎస్) అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు మరిపాల శ్రీనివాస్, డైరెక్టర్లు డేగ కుమార్, ప్రతాప్ రెడ్డి, దండా రామకృష్ణ, సలహాదారు విక్రమ్‌రెడ్డి, సభ్యులు వేములపల్లి రాజు, పోలంపల్లి ఆంజనేయులు కలిశారు.
ఈ సందర్భంగా వారు తమకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కేటీఆర్‌కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి డీజేహెచ్‌ఎస్ గురించి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తొలి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ డీజేహెచ్‌ఎస్ అని ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కాగా, జర్నలిస్టులకు ఇంటి స్థలాల విషయంపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతానని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. కొన్ని సంవత్సరాల నుంచి వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. దీనికోసం ఇప్పటికే పలుమార్లు జర్నలిస్టులు ఈ విషయాన్ని అధికార పార్టీ నేతల దృష్టికి తీసుకువెళ్లిన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వేసినట్లు ఉంది. ఈ సారైనా ప్రభుత్వం స్పందిస్తుందో చూడాలి అంటున్నారు జర్నలిస్టులు.