కాకినాడ పోర్టును మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫ్యామిలీ కబ్జా చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జిల్లాలో పర్యటించిన ఆయన యాంకరేజ్ పోర్టు గోదాములను పరిశీలించారు. రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు. రేషన్ బియ్యం నిల్వ ఉంచిన అశోక, హెచ్ 1 గోదాములను సీజ్ చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ ద్వారంపూడి కుటుంబం పేద ప్రజల పొట్ట కొడుతోందని నాదెండ్ల ఆరోపించారు.
పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారని మంత్రి నాదెండ్ల తెలిపారు. రేషన్ బియ్యం ఎగుమతితో దేశానికి ద్వారంపూడి ఫ్యామిలీ చెడ్డ పేరు తీసుకొస్తున్నారంటూ మండిపడ్డారు. రేషన్ బియ్యం షిప్పింగ్ నిలిపివేయాలని కాకినాడ పోర్టు అధికారులను ఆదేశించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పోర్టు అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలింపు ఘటనపై కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్, సివిల్ ప్లె ఎండీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశామని, అక్రమాలు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ మనోహర్ హెచ్చరించారు.