కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. తాజాగా ఈ నిరసనల తాకిడి తెలంగాణకు తాకింది. సికింద్రాబాద్‌లో భారీ స్థాయిలో నిరసన కారులు ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలపై రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. అగ్నిపథ్ పథకం అనేది ఒక అనాలోచిత నిర్ణయం అని, అందువల్లే దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయని అన్నారు. దేశభద్రత విషయంలో కేంద్రం తప్పుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పదో తరగతి పాసైన విద్యార్థులు అగ్నిపథ్‌లో చేరి.. వారు తిరిగి వెళ్లేటప్పుడు 12వ తరగతి పాసైన సర్టిఫికేట్ ఇస్తామని చెప్పడం దారుణమన్నారు. మొన్నటివరకు వ్యవసాయ చట్టాలు రద్దుపై ఆందోళనలు జరిగితే.. ఇప్పుడు అగ్నిపథ్ పథకంపై ఆందోళన జరుగుతున్నాయని అన్నారు. నల్లధనం తీసుకొస్తాం.. పేదల ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి గెలిచిన కేంద్రం.. జీఎస్టీ పేరుతో దోచుకుంటోందని విమర్శించారు.
ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి అమ్మేస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ పాలనలో దేశంలో నిరుద్యోగ శాతం 5.6 నుంచి 7.83కి పెరిగిందన్నారు. ఆకలి సూచిలో 110 దేశాలలో భారత్ 101వ స్థానంలో ఉందంటే దేశ పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. పేర్కొన్నారు. మోడీ పాలన.. మోసాల పాలన అని అభివర్ణించారు. వెంటనే కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.