దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో తెలంగాణ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు సాయంత్రం 6 గంటల్లోగా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని, ఒకవేళ వారు విధులకు హాజరుకాకపోతే.. వారిని ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించబోమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ హెచ్చరించారు.
ఆరుగంటల లోపు విధులకు హాజరైన వారే ఆర్టీసీ ఉద్యోగులని స్పష్టం చేశారు. వీధులకు చేరని వారు భవిష్యత్‌లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ఉద్యోగులుగా సంస్థ గుర్తించదని తెలిపారు. అలాగే ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పలు చర్యలు తీసుకున్నట్టు తెలియజేశారు. నాలుగు వేల బస్సులను అద్దెకు తీసుకుంటున్నట్టు తెలియజేసిన మంత్రి అర్హత కలిగిన వారికి ఆర్టీసీలో ఉద్యోగ అవకాశాల కల్పిస్తున్నామన్నారు. ప్రయివేటు బస్సులకు రూట్ పర్మిట్లు జారీ చేస్తున్నట్టు మంత్రి తెలియజేశారు.