స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించడంపై మంత్రి రోజా ఆనందం వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణులతో కలిసి సంబరాలు చేసుకున్న ఆమె తన నివాసం వద్ద టపాసులు కాల్చారు. స్వీట్లు పంచిపెట్టారు. ‘బాబు చేసిన తప్పులకు ఎప్పుడో అరెస్ట్ అయ్యుండాలి. భగవంతుడు ఇప్పుడు టైమ్ ఎందుకు డిసైడ్ చేశాడంటే ఇదే వయసులో ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి, ఆయన మీద చెప్పులు వేయించి చావుకు కారణమయ్యాడు’ అని మండిపడ్డారు. తప్పు చేస్తే సామాన్యుడికి ఏ శిక్ష పడుతుందో అదే శిక్ష చంద్రబాబుకు ఉండాలని పర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు.
ఆయనేం చట్టాలకు ఆతీతం కాదంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబును అరెస్టు చేస్తే ఎక్కడా సింపతీ రాలేదని రోజా పేర్కొన్నారు. ఇన్నాళ్లు వ్యవస్థలను చంద్రబాబు మ్యానేజ్ చేస్తూ వచ్చారని, ఇక ఉండదని రోజా తెలిపారు. చంద్రబాబుకు రిమాండ్ విధించడాన్ని స్వాగతిస్తున్నానని రోజా అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ (థర్డ్ అడిషనల్ సెషన్స్) కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ నెల 22వ తేదీ వరకు ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కోర్టు తీర్పు రావడంతోనే ఆయనను భారీ పోలీసు భద్రత నడుమ విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు.