టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. గాంధీ జయంతి రోజున టీడీపీ పిలుపు మేరకు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు టీడీపీ శ్రేణులు. రాజమండ్రిలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, ఢిల్లీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘సత్యమేవ జయతే దీక్ష’ చేశారు. అయితే.. దీనిపై ఏపీ క్రీడలు, పర్యాటకం, యువజన వ్యవహారాల మంత్రి రోజా స్పందించారు. ఏదో త్యాగం చేసినట్టు చంద్రబాబు, భువనేశ్వరి దీక్ష చేస్తున్నారని విమర్శించారు. వారికి ప్రజల నుంచి సానుభూతి దక్కదని అన్నారు. చంద్రబాబుది హింసా మార్గమని అందరికీ తెలుసని, ఎన్టీఆర్ నుంచి ముద్రగడ వరకు వేధించిన సంస్కృతి చంద్రబాబు సొంతమని అన్నారు. చంద్రబాబు దొంగ దీక్షను ఎవరూ పట్టించుకోవడంలేదని రోజా వ్యాఖ్యానించారు.
చంద్రబాబు గాడ్సే కంటే ఘోరమైన వ్యక్తి అని, ఇవాళ గాంధీ మహాత్ముడ్ని అవమానించేందుకు దీక్ష చేస్తున్నారని విమర్శించారు. ఇక, టీడీపీ నేత బండారు సత్యనారాయణపైనా రోజా మండిపడ్డారు. టీడీపీ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఓ మహిళా మంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని, అతడి తల్లిదండ్రుల పెంపకం ఎలాంటిదో అతడి వ్యాఖ్యలే చెబుతున్నాయని బండారుపై విమర్శనాస్త్రాలు సంధించారు.