కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 136 స్థానాల్లో ఘన విజయం సాధించారు. అధికారంలో ఉన్న బీజేపీ ఓడిపోయింది. అయితే 60 స్థానాల్లో ఆధిక్యం చాటింది. ఇక కింగ్ మేకర్ అవుతారనుకున్న కుమార స్వామి 20 సీట్లకే పరిమితమయ్యారు. అయితే ఈ ఫలితాలపై ఏపీ మంత్రి రోజా స్పందించి టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్స్ వేశారు. చంద్రబాబు కాంగ్రెస్ ను వదిలేశారని, అందుకే ఆ పార్టీ కర్ణాటకలో గెలిచిందని ఎద్దేవా చేశారు.
“మొన్ననే చంద్రబాబు… మోదీతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాను అన్నారు… అంతే… ఢమాల్… బీజేపీ పడిపోయింది” అని రోజా వ్యంగ్యం ప్రదర్శించారు. బాబు గారితో కలిస్తే ఓటమి… విడిపోతే విజయం అని పేర్కొన్నారు. ఇదే రాజకీయ సూత్రం అని రోజా వివరించారు. ఈ ట్వీట్ చూసిన కొందరు టీడీపీ నేతలు మంత్రి రోజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో రోజా వైసీపీలో చేరడంతో ఆ పార్టీ ఓటమి పాలైందని, ఈసారి ఎన్నికల్లో కూడా రోజా వల్లే వైసీపీ ఓడిపోబోతోందని విమర్శలు చేస్తున్నారు. మరి వీరి వ్యాఖ్యలకు రోజా స్పందన ఎలా ఉంటుందో చూడాలి.