గత ఆరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం వివిధ శాఖలో 1,33,999 ఉద్యోగాలు భర్తీ చేసిందని, ఇది అబద్ధమని నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి గెలుపును కాంక్షస్తూ భోలక్‌పూర్ డివిజన్‌లో నిర్వహించిన సర్యసభ్య సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు. ఉద్యోగాలపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారని మంత్రి సవాల్ విసిరాడు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇంకా 50 వేల ఉద్యోగాలు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామంది అది జరిగిందా అని ఆయన ప్రశించారు.
మతం అడ్డుపెట్టుకొని లబ్ధికి యత్నం..
బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు నిరుద్యోగుల కోసం ఏం చేశారో చెప్పాలని, మతాన్ని అడ్డుకొని లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని దీన్ని ప్రజలు తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఏఏ శాఖలో ఎన్నెన్ని ఉద్యోగాలు భర్తీ చేశామో ఆర్టీఐ వద్ద పూర్తి సమాచారం ఉందని కావాలనుకునే ప్రతిపక్ష నేతలు ఆ సమాచారాన్ని కళ్లు పెద్దవి చేసి చూసుకోవాలన్నారు. దేశంలోనే సర్వమతాలను సమానంగా చేసేది ఏకైక పార్టీ టీఆర్‌స్సే నని ఆయన ఉద్ఘాటించారు. వాణీదేవి గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేసి భారీ మెజార్టీ చేకూర్చాలన్నారు.