బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ అయినా బీసీ మహిళకు చాన్స్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం. అయితే ఈ అనూహ్య నిర్ణయం వెనుక మంత్రి వెల్లంపల్లి పెద్ద స్కెచ్ వేశారట. రేపటి రోజున మంత్రి పదవి ఉన్నా ఊడినా ఆ కులాన్ని దగ్గరకు తీసుకుంటే తనకు తిరుగులేదని లెక్కలేసుకున్నారట. పైకి బీసీలకు పెద్ద పీఠ వేశామని చెప్పినా మంత్రి వెల్లంపల్లి నడిపిన మాంత్రంగం పై ఇప్పుడు బెజవాడలో ఆసక్తికర చర్చ నడుస్తుంది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి మూడుసార్లు పోటీ చేసిన వెల్లంపల్లి రెండుసార్లు గెలిచారు. ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో నగరాలు అనే సామాజికవర్గం ఓట్లు ఎక్కువ. దాదాపు 40వేలకు పైగా ఓట్లు ఈ సామాజికవర్గానికి ఉన్నాయట.గత ఎన్నికల్లో వెల్లంపల్లికి ఈ సామాజిక వర్గం నుంచి చుక్కెదురైందట.అందుకే ఆ వర్గానికి చెందిన రాయన భాగ్యలక్ష్మిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టినట్టు చెబుతున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో నగరాల సామాజికవర్గానికి చెందిన వారి ఆలయాలు, కల్యాణ మండపాలు నిర్వహిస్తున్న వ్యక్తి ఒకరు స్వతంత్ర అభ్యర్థికి మద్దతిచ్చారు. ఇదే వర్గానికి చెందిన మరో నేత జనసేన అభ్యర్థి పోతిన మహేష్‌కు సహకరించారట. ఓట్లు చీలడంతో వెల్లంపల్లికి గెలుపు ఈజీ అయింది. ఈ సామాజికవర్గం తనకు దూరంగా ఉండటంతో రాయన భాగ్యలక్ష్మిని మేయర్‌ను చేసి.. నగరాల వర్గానికి చేరవయ్యేందుకు ప్రయత్నించారు. మేయర్ పీఠం కోసం పుణ్యశీలతోపాటు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు పోటీ పడినా.. పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పించి పంతం నెగ్గించుకున్నారు వెల్లంపల్లి.
మంత్రి పదవి ఎలా ఉన్నా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నగరాల సామాజికవర్గం ఓట్లు గంపగుత్తగా పడతాయని, ఎమ్మెల్యే పదవికి ఢోకా ఉండబోదని మంత్రి వెల్లంపల్లి లెక్కలేస్తున్నారట. దీనికో తోడు మేయర్ కూడా తన మనిషి కావడంతో నగరం పై పట్టు కూడా సడలకుండా ఉంటుందని భావిస్తున్నారట. మంత్రి వెల్లంపల్లి వ్యూహం సక్సెస్ అవుతుందో లేదో తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.