జీ7 సదస్సు జరుగుతున్నప్పుడు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశానుసారం గంట వ్యవధిలోనే ఉక్రెయిన్ నగరాలపై రష్యా బలగాలు క్షిపణులతో దాడికి దిగాయి. తూర్పు ఉక్రెయిన్‌ను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవడానికి రష్యా బలగాలు రాజధాని కీవ్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. కీవ్‌లోని రెండు రెసిడెంట్ కాంప్లెక్స్ లపై క్షిపణుల వర్షం కురిపించాయని స్థానిక మేయర్ విటాలీ క్లిట్ స్కో వెల్లడించారు.
ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకరు మరణించారు. శిథిలాల నుంచి ఏడేళ్ల చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు. ఇప్పటికే సీవిరోడోంటెస్క్ రష్యా వశమైంది. లీసిచాన్‌స్క్ లో ఆదివారం రష్యా వైమానిక దాడుల్లో టీవీ టవర్ ధ్వంసమైంది. ఒక వంతెన పూర్తిగా దెబ్బతిన్నట్లు లుహాన్‌స్క్ గవర్నర్ తెలిపారు. కీవ్ ప్రాంతంలో రష్యా బలగాలు గంటల వ్యవధిలోనే 14 క్షిపణులు ప్రయోగించినట్లు ఉక్రెయిన్ ఎంపీ ఒలెస్కీ గోంచారెంకో తెలిపారు.
కాగా, రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై జీ7 సభ్యదేశాల ప్రతినిధులు హేళన చేశారు. జర్మనీలో జరుగుతున్న ఈ సదస్సులో ఏడు సంపన్న దేశాల గ్రూప్ నాయకులు పాల్గొన్నారు. చొక్కాలు విప్పేసి మనం కూడా పుతిన్ కంటే కఠినంగా ఉన్నామని నిరూపించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. అలాగే చొక్కా లేకుండా గుర్రపు స్వారీ చేయాలని కెనడా ప్రధాని జస్టిన్‌ట్రూడో హేళన చేశారు.