కేంద్రం నూతనంగా ప్రవేశపెట్టిన అగ్నిపధ్ పథకంపై మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్నిపధ్ సైనిక ఉద్యోగ అవకాశం కాదని యువతను దగా చేయడమే అని అన్నారు. రిటైర్ అయిన తరువాత పింఛన్లు ఉండకపోవడం ప్రయోజనకరం అవుతుందా? అని ప్రశ్నించారు. నాలుగేళ్లపాటు చిన్న తనంలోనే సైనికులుగా చేరి అగ్ని వీరులు అయ్యి బయటకు ఖాళీ చేతులతో ,నిరుద్యోగంతో వస్తే వారికి పెళ్లిళ్లు అవుతాయా?అని ప్రశ్నించారు.
అగ్ని వీరులు అవుతారని వారిని సైనికులుగా తీసుకొని తరువాత వారి భవిష్యత్తును అంధకారం లోకి నెట్టే విధంగా ఈ స్కీమ్ ఉందని పేర్కొన్నారు. ఆరోగ్య భీమాలు ఉండవు, తరువాతి జీవితాలు గడిపేందుకు పింఛన్లు దక్కవు, చేసేందుకు ఉద్యోగాలు రావు, వ్యక్తిగత జీవితాలను వెక్కిరిస్తూ వారిని పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు ముందుకు రారు అని విశ్లేషించారు. కేంద్రం ఇప్పటికైనా ఈ స్కీమ్ ను పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. అగ్నిపధ్ పై తాను త్వరలోనే యువతను కలుసుకొని వారి నిర్దిష్ట అభిప్రాయాలను తెలుసుకుంటానని చెప్పారు.