ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు
‘శ్రీకాకుళం సాహితీ శిఖరం’ పుస్తకం ఆవిష్కరణ
ప్రముఖ రచయిత,సాహితీ వేత్త, కథా నిలయం వ్యవస్థాపకుల్లో ఒకరైన రామారావు నాయుడు మృదు స్వభావి అని,ఆయన మరణం సాహితీ లోకానికి తీరని లోటు అని పేర్కొంటూ శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు నివాళులర్పించారు. స్థానిక ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో డాక్టర్ బి.వి.ఎ.రామారావు నాయుడు సంస్మరణ సభను ఆదివారం నిర్వహించారు.ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ..ఒక విషయాన్ని తెలియజేసే విధానంలో వాటి పూర్వపరాలు అర్థమయ్యే రీతిలో చెప్పేవారని తెలిపారు.
శ్రీకాకుళ సాహితి అనే సంస్థకు ఎక్కువ కాలం అధ్యక్షులుగా ఉన్నారని,అదేవిధంగా వృక్ష శాస్త్రంలో పరిశోధనకు ఎక్కువ సమయం ఆయన కేటాయించేవారని గుర్తుచేశారు.కనుమరుగవుతున్న ఔషధ మొక్కల మీద విరివిగా ప్రచారం జరగాలి అనే కోరిక,వెలుగులోకి తీసుకు వచ్చిన విషయాలను,వివరాలను భవిష్యత్ తరాలకు అందించాలనే తపన రామారావులో ఉండేవని అన్నారు.సమాజం హితం కోరుతూ..తనదైన భావజాలాన్ని పొందుపరుస్తూ తన రచనా ప్రస్థానం సాగించారనితెలిపారు.
సమాజానికి ప్రయోజనకారి అయిన వ్యక్తి మరణించడం అన్నది వారి కుటుంబానికే కాదు యావత్ సాహితీ లోకానికి, పరిశోధన రంగానికీ పెద్ద లోటు అని,అలాంటి వ్యక్తుల మరణం పూడ్చలేనిదని అన్నారు.తండ్రి ఆశయాలను కొనసాగించేందుకు కృషి చేస్తున్న రామారావు కుమారులను ఎమ్మెల్యే ధర్మాన అభినందించారు. కార్యక్రమంలో రచయితలు అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు,గుమ్మా నగేష్, వీజీకే మూర్తి, పిఎస్.నాగరాజు, గార కృష్ణారావు, దాసరి రామచంద్రరావు,చింతాడ తిరుమల రావు,సూరంగి మోహనరావు,విష్ణు మూర్తి తదితరులు పాల్గొన్నారు.