- విద్యార్థులకు ఎమ్మెల్యే ధర్మాన పిలుపు
- సైన్సు డేకు ముఖ్య అతిథిగా హాజరు
శ్రీకాకుళం : చదువుతోనే పౌరులు సరైన మార్గాన్ని నిర్దేశించుకోగలుగుతారని,అదేవిధంగా విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి,దేశ ప్రగతికి సరికొత్త ప్రయోగ రీతులు అందించే తోడ్పాటు కూడా ఎంతో అవసరం అని,అందుకే వైజ్ఞానిక రంగంపై దృష్టి సారించాలని శ్రీకాకుళం శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడ్డారు.సర్ సి.వి రామన్ జయంతి సందర్భంగా శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలోని మహలక్ష్మీ నగర్ కాలనీ,శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో సైన్స్ ఎక్స్ పో – 2022 ను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన ఉండడంతో పాటు సృజనాత్మకత పెంపొందించుకోవాలని, తద్వారా కొత్త విషయాలు తెలుసుకోవాలని కోరారు.రాబోయే రోజులన్నీ విజ్ఞాన శాస్త్రానివేనని,శాస్త్ర – సాంకేతిక రంగాలలో భారతదేశం పాత్ర చాలా కీలకమైనదని అన్నారు.ఇదే సమయంలో శాస్త్ర – సాంకేతిక రంగాల వైపు విద్యార్థులు దృష్టి మరల్చేందుకు,సంబంధిత రంగాల్లో విషయ వివేచన పెంపొందించుకునేందుకు కృషి చేస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థను అభినందించారు.
రాష్ట్రంలో వైస్సార్సీపీ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోందిని,సంబంధిత రంగంలో సమూలంగా మార్పులు తీసుకురావాలన్న ప్రయత్నంలో భాగంగా మౌలిక వసతులు కల్పన,సిలబస్ లో మార్పులు చేశామన్నారు.భవిష్యత్ లో బోధన సంబంధ విషయాల్లో మరిన్ని మార్పులకు ప్రభుత్వం శ్రీకారం దిద్దబోతోందని కూడా చెప్పారు. అనంతరం ధర్మానను సైన్స్ ఎక్స్ పో – 2022 తరఫున ఘనంగా సన్మానించారు నిర్వాహకులు.కార్యక్రమంలో వైస్సార్సీపీ యువ నాయకులు మెంటాడ వెంకట స్వరూప్, కరమ్ చంద్, అరసవల్లి క్షేత్ర పాలక మండలి సభ్యులు మండవిల్లి రవికుమార్, శ్రీ చైతన్య విద్యా సంస్థల ప్రతినిధులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.