బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కరీంనగర్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బండి సంజయ్ అరెస్టును రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు ఖండించారు. మరోవైపు బండి సంజయ్ అరెస్టు గురించి తెలుసుకున్న పలువురు నేతలు బొమ్మలరామారం వద్దకు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్లో బండి సంజయ్‌ను ఉంచారన్న సమాచారం మేరకు ఆ వివరాలు తెలుసుకునేందుకు బీజేపీ నేతలు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.
బండి సంజయ్‌కు సంఘీభావం తెలుపుతూ బొమ్మలరామారం చేరుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు రఘునందన్‌కు మధ్య తోపులాట జరిగింది. ఆయణ్ను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తమ వాహనంలో వేరే చోటుకు తరలించడానికి ప్రయత్నించగా బీజేపీ మహిళా కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకున్నారు.
‘ఎమ్మెల్యే అని చూడకుండా 2 కిలోమీటర్ల దూరంలో అడ్డుకున్నారు. బండి సంజయ్‌ను ఎందుకు అరెస్ట్ చేశారు?:
ఏ కేసులో సంజయ్‌ను అరెస్ట్ చేశారో చెప్పడం లేదు. పోలీసులు.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించడం లేదు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు చేయడంలేదు.’ అని రఘునందన్ రావు అన్నారు