జనగామ: బీఆర్‌ఎస్ టికెట్ రాకపోవడంపై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇల్లు అలకగానే పండగకాదని.. ఎన్నికలు ఇంకా మూడు నెలలు ఉన్నాయని అన్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని అంతా అనుకుంటున్నారని.. ఎవరూ రారు…. ఏదీ కాదన్నారు. తాను ప్రజాక్షేత్రంలోనే ఉంటానంటూ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కాగా.. బుధవారం లింగాలఘనపురం మండలంలో కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
అయితే ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్‌కు చెందిన స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, ఇతర నేతలు హాజరుకాకపోవడంతో రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక ఒంటరిగానే చెక్కులు పంపిణీ చేశారు. ప్రజాప్రతినిధులు నిన్నటి వరకూ తన వెంట ఉండి… ఇప్పుడు కడియం వర్గానికి జంప్ కావడంతో రాజయ్య ఆవేదన చెందారు.
ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 119 నియోజకవర్గాలకు గాను 115 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం ఏడు స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. అందులో స్టేషన్ ఘన్ పూర్ కూడా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియం శ్రీహరికి టిక్కెట్ కేటాయించారు. దీంతో రాజయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అయినప్పటికీ తాను కేసీఆర్ వెంటే నడుస్తానని ఆయన ప్రకటించడం గమనార్హం.