వైసీపీనే తన కుటుంబమని.. తన రాజకీయాలు అందరితోనూ ముడిపడి ఉన్నాయని చెబుతూ వచ్చే జబర్దస్త్ రోజా.. ఇప్పుడు అదే పార్టీలో ఒంటరి అయ్యారా? ఆమెను ఎవరూ పట్టించుకోవడం లేదా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇటీవల సీఎం జగన్ తిరుమల పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో రోజా కూడా పాల్గొన్నారు. హడావుడి చేశారు. జగన్ వెంట చాలా సేపు గడిపారు. ఇంత వరకు తెరమీద కనిపించిన విషయం. కానీ, దీని వెనుక చాలానే జరిగిందని అంటున్నారు పరిశీలకులు.
సీఎం జగన్ తిరుమల వస్తున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు చాలా మంది ఆయనతోపాటు శ్రీవారి దర్శనం చేసుకోవాలని, కుదిరితే రాజకీయాలు కూడా మాట్లాడాలని అనుకున్నారు. కానీ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికంటే కూడా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆది నుంచి అంతం వరకు జగన్ పక్కన ఎవరుండాలి? తిరుమల పర్యటన ఎలాసాగాలి? అని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే పలమనేరు సహా శ్రీకాళహస్తి తదితర నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఎంట్రీ లేదని తెగేసి చెప్పారు.
ఇక, ఈ క్రమంలోనే రోజాకు కూడా అనుమతి లేదని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అయితే, తాను ఎమ్మెల్యేనే కాకుండా ఏపీఐఐసీ చైర్ పర్సన్ కూడా అయినందున అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో ఏ ఒక్కరూ సహకరించలేదు. దీంతో నేరుగా ఆమె సీఎం వ్యక్తిగత కార్యదర్శికి ఫోన్ చేసి.. తిరుమలకు వచ్చేందుకు మార్గం సుగమం చేసుకున్నారని తెలిసింది. అంటే.. రోజా విషయంలో ఎవరికీ సింపతి కనిపించడం లేదని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా పేర్కొనడం గమనార్హం.
ఇక, మహిళా నాయకులు కూడా రోజాను పట్టించుకోవడంలేదనేది బహిరంగ రహస్యమే. ఏదైనా అసెంబ్లీ సమావేశాలు ఉంటే తప్ప ఎవరూ కూడా రోజాను పట్టించుకోరని అంటున్నారు. మరి సొంత పార్టీ కుటుబంలో తాను ఒంటరి అవుతున్న కారణం తెలుసుకుంటున్నారా? తప్పులు సరిచేసుకునే పనిలో పడ్డారా? రోజా విషయంలో మున్ముందు ఏం జరుగుతుంది? ఆసక్తిగా ఉండడం గమనార్హం.
-vuyyuru subhash