చిలకలూరిపేట పట్టణం నుంచి కొత్తగా పింఛన్ అర్హత పొందిన 68 మంది లబ్ధిదారులకు శుక్రవారం నగదు అందజేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పింఛన్ పొందాలంటే వయసు అర్హతను 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు కుదించి ఎందరో వృద్ధులకు తాము ఆర్థిక చేయూతనిస్తున్నామన్నారు. ఎన్నికలకు ముందుకు వెయ్యి రూపాయలు ఉన్న పింఛన్‌ను తాము అధికారంలోకి వచ్చాక రూ.2250 చేశామని, విడదతల వారీగా పెంచుకుంటూ త్వరలోనే పింఛన్ ను మూడు వేల రూపాయలు చేస్తామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీకి నెలకు 400 కోట్లు ఖర్చయ్యేదని, ఇప్పుడు ఆ విలువ రూ.1400 కోట్లకు పెరిగిందని చెప్పారు. ఎంత ఖర్చయినా సరే వెనుకాడే ప్రసక్తే లేదని, తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవర్చుకుంటూ ముందుకు వెళుతోందని చెప్పారు. ఇంటింటికీ వాలంటీర్లే వచ్చి పింఛన్లు పంపిణీ చేస్తున్నారని ఇలాంటి ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరని తెలిపారు. పింఛన్ల మంజూరే కాదు.. పంపిణీ లో సైతం సరికొత్త విధానాలను అనుసరిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీనివాసరావు, అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.