దిల్లీ భాజపా నేతలపై ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా వేయనున్నారు. ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాపై దావా వేయనున్నట్లు సమాచారం. దిల్లీ లిక్కర్ స్కామ్‌లో తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకే దావా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆమె న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు.
దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దిల్లీ లిక్కర్ స్కామ్‌లో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. దిల్లీ లిక్కర్ స్కామ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ కుమార్తె కాబట్టి తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
“ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్ వెనక్కి తగ్గేది లేదు. కేసీఆర్‌ను మానసికంగా వేధించాలనుకుంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. ఉద్యమ సమయంలోనూ కేసీఆర్‌పై అనేక ఆరోపణలు చేశారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం… ఎవరికీ భయపడేది లేదు. దిల్లీ లిక్కర్ స్కామ్‌లో నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం. కేంద్రాన్ని విమర్శిస్తున్న కేసీఆర్‌ను తగ్గించడానికే భాజపా కుట్ర. కేసీఆర్ కుమార్తెను బద్నాం చేస్తే కేసీఆర్ తగ్గుతారనుకుంటున్నారు. కేంద్రం చేతిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. ఏ దర్యాప్తునకైనా సిద్ధమే.. మాది పోరాటం చేసిన కుటుంబం.” అని కవిత అన్నారు.