టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కేంద్ర పెద్దలు లైట్ తీసుకున్నారా…? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఘోరంగా ఓడిపోయిన తర్వాత కేంద్ర పెద్దలను కలవడానికి దాదాపు ఆరు సార్లు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలోనే ఎక్కువగా ఉండే బిజెపి ఎంపీ సుజనాచౌదరి ద్వారా ఎన్ని రాయబారాలు చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ లేదా హోంమంత్రి అమిత్ షా ను కలవడానికి చంద్రబాబు పలుమార్లు కేంద్ర మంత్రులతో కూడా సంప్రదింపులు జరిపారు.
అయినా సరే ఆ ఇద్దరూ కలవడానికి ఎంత మాత్ర౦ ఇష్టపడలేదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా మూడు రాజధానుల అంశం కూడా ఎక్కువగానే ప్రచారంలో ఉంది. ఈ రెండు అంశాలను కేంద్ర పెద్దలకు చంద్రబాబు నేరుగా వివరించటానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఈ మేరకు కేంద్ర పెద్దలను కలవడానికి ఆయన గత నాలుగు నెలల నుంచి కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారు. అయినా సరే హోంమంత్రి గాని, ప్రధానమంత్రి గాని చంద్రబాబు ను కలవడానికి ఇష్టపడటం లేదని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.
వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ అరాచకాలను నేరుగా హోంమంత్రి వివరించాలని చంద్రబాబు భావించారు. హోంమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో బిజెపి ఎంపీల ద్వారా ఆయన ఈ ప్రయత్నం చేశారు. జీవీఎల్ నరసింహారావు టీజీ వెంకటేష్ సీఎం రమేష్ ద్వారా చంద్రబాబు నాయుడు కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మూడు రాజధానులు విషయంలో చంద్రబాబు నాయుడు కేంద్ర పెద్దలకు ఒక నివేదిక ఇవ్వాలని ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నాలు పెద్దగా ఫలితం లేదట.