కేంద్ర కేబినెట్‌లోకి చిన్నమ్మను తీసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిన్నమ్మను కేబినేట్‌లోకి తీసుకుని ఏపీలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని ఆలోచన చేస్తున్నారట. అందుకే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన బంఫర్ ఆఫర్‌ను కూడా చిన్నమ్మ తిరస్కరించడానికి కారణం ఇదేనని ప్రచారం జోరుగా సాగుతుంది. ఇంతకు ఈ చిన్నమ్మ ఎవ్వరు..? ఈ చిన్నమ్మకే కేంద్రమంత్రి పదవి ఇవ్వడానికి గల కారణాలు ఏమిటీ..? దివంగత సీఎం ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురందేశ్వరి. ఈమెకు కేంద్ర మంత్రి వస్తుందని గత మూడు, నాలుగేళ్ళుగా ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ ఆమేకు ఆ పదవి వరించలేదు.
ఈసారి తప్పకుండా వస్తుందని అంతా నమ్ముతున్నారు. ఇంతకు వస్తుందా లేదా అంటే ఎవ్వరు ఇతిమిద్దంగా చెప్పలేకున్నా, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే నిజమే కావొచ్చని తెలుస్తుంది.
దక్షిణ భారత దేశంలో బీజేపీని బలోపేతం చేయాలని బీజేపీ అగ్రనాయకత్వం తీవ్రంగా ఆలోచన చేస్తుంది. ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కావడం లేదు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎలాగైనా బీజేపీని దక్షిణాదిన బలోపేతం చేయాలంటే ముందుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇప్పుడు కర్నాటకలో బీజేపీ సర్కారు ఉంది.
ఇక తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైనా బీజేపీని పటిష్టం చేయాలంటే అందుకు తగిన కార్యాచరణ చేపట్టాల్సి ఉంది. అందుకే కేంద్ర కేబినేట్‌లో ఒకరిద్దరికి స్థానం కల్పిస్తే కొంత రాజకీయంగా బలోపేతం అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. అందుకే కేంద్ర కేబినేట్‌లో తెలంగాణ నుంచి జి.కిషన్‌రెడ్డికి స్థానం ఇచ్చారు. అయితే ఏపీ నుంచి మాత్రం కేంద్ర కేబినెట్‌లో స్థానం లేదు. ఇప్పుడు కేంద్ర కేబినెట్ విస్తరణ చేయాలని ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయం తీసుకున్నారని ఓవైపు ప్రచారం జరుగుతుంది. ఈ కేబినెట్ విస్తరణలో ఎలాగైనా ఏపీ నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీలోని అగ్రనాయకులు కొందరు పీఎం నరేంద్రమోడీ దృష్టికి తీసుకెళ్ళినట్లు ప్రచారం జరుగుతుంది.
అయితే ఏపీలో జీవిఎల్ నరసింహారావు బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఇక ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరితో పాటు నలుగురు ఎంపీలు ఉన్నారు. అయితే జీవిఎల్‌కు ఇప్పటికే పార్టీలో ప్రముఖ స్థానం ఉంది. ఇక టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చినవారికి మంత్రి పదవి ఇవ్వడం తప్పుడు సంకేతాలు వెళుతాయి. అందుకే పార్టీ కోసం కష్ట పడుతున్న దగ్గుబాటి పురందేశ్వరికి ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో కేంద్ర నాయకత్వం ఉందని సమాచారం. పురంధేశ్వరి ఇంతకు ముందు కాంగ్రెస్ సర్కారులో కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.
ఇక ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కొడుకు హితేష్‌లు వైసీపీలో ఉన్నారు. జగన్ ఇప్పటికే పురందేశ్వరి వైసీపీలోకి వస్తే బంఫర్ ఆఫర్ ఇస్తానని ప్రకటించారట. కానీ పురంధేశ్వరి ససేమిరా అంటున్నారట. తన భర్తను, కొడుకును వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలని ఆమె ఒత్తిడి తెస్తున్నారట. పురందేశ్వరికి కేంద్ర కేబినెట్‌లో స్థానం కల్పిస్తే అటు ఎన్టీఆర్ కుటుంబాన్ని తమవైపు తిప్పుకోవచ్చు. ఇక ఏపీలో దగ్గుబాటి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. దీంతో బీజేపీకి మరింత లాభం చేకూరుతుంది. ఇక ఇంతకు ముందు కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధంతో కాంగ్రెస్ నేతలు బీజేపీ వైపుకు లాక్కోవచ్చు.
ఇక వైసీపీలో తన కుటుంబం ఉన్న నేపథ్యంతో ఆ పార్టీ నుంచి కూడా చాలా మంది నేతలను ఆకర్షించవచ్చు. ఇన్ని అనుకూల పరిస్థితులు ఉన్న నేపథ్యంతో చిన్నమ్మకు కేంద్ర మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని ప్రచారం జరుగుతుంది. పురంధేశ్వరిని ముందుగా రాజ్యసభకు పంపి, ఆపై కేంద్ర మంత్రిని చేస్తారా..? లేక ముందుగానే కేంద్ర మంత్రిని చేసిన తరువాత రాజ్యసభకు పంపుతారా .? లేక మరోమారు శూన్యహస్తమే చూపుతారా అనేది తేలాల్సి ఉంది.